ముచ్చర్ల అరుణ పెళ్లి ఎవరితో, ఎలా జరిగిందో తెలుసా?
on Oct 18, 2021
ముచ్చర్ల అరుణ అనగానే మనకు మొదట గుర్తొచ్చే సినిమా 'సీతాకోక చిలుక' (1981). భారతీరాజా డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ మూవీ తెలుగులో ఆమె మొట్టమొదటి సినిమా కూడా. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నాయికగానే కాకుండా, కథకు కీలకమైన పాత్రలను చేసి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అరుణ. ఆమె వివాహం చండీగర్‌కు చెందిన వ్యాపారవేత్త మోహన్ గుప్తాతో జరిగింది. వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు, అలాగని ప్రేమ వివాహం కూడా కాదు. ఆసక్తి కలిగించే ఆ కథలోకి వెళ్తే...
చెన్నైలో ముచ్చర్ల అరుణ పక్కింటివాళ్ల దగ్గరకు మోహన్ వస్తుండేవారు. ఆయనకు అరుణ కజిన్ బ్రదర్ ఫ్రెండయ్యారు. అలా అరుణ వాళ్లింటికి కూడా ఆయన వస్తుండటంతో ఆమెకు కూడా ఆయన పరిచయమయ్యారు. ఎప్పుడైనా అరుణ షూటింగ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆయన అక్కడ కలుస్తుండేవారు. "ఈరోజు నీ మేకప్ చాలా సింపుల్‌గా బాగుంది", "ఈరోజు నీ డ్రస్ బాగుంది", "యు లుకింగ్ నైస్".. ఇలా అనేసి వెళ్లిపోయేవారు. అరుణతో మాటలు కలపాలని ఆయన ప్రయత్నించేవారు. ఆమె కూడా మాట్లాడుతుండేవారు.
ఒక రెండు వారాలు ఇలా గడిచాక, ఒకసారి సడన్‌గా "విల్ యు మ్యారీ మీ" అని మోహన్‌ను అడిగేశారు అరుణ. నిజానికి అప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకోలేదు. ఇంకా మంచి పాత్రలు చెయ్యాలి, మంచి పొజిషన్లోకి రావాలి.. అని మనసులో అనుకుంటూ ఉండేవారు. అరుణ అలా అడగడంతో ఒక్కసారిగా షాకయ్యారు మోహన్. వెంటనే ఏం చెప్పాలో ఆయనకు తోచలేదు. కొన్ని క్షణాలు గడిచాక, "నాకు కొంత టైమ్ కావాలి" అని చెప్పి వెళ్లిపోయారు.
మోహన్‌ను పెళ్లి చేసుకొమ్మని తను అడిగిన విషయం ఇంట్లోవాళ్లకు అరుణ చెప్పలేదు. అందుకని వారికెవరికీ ఈ విషయం తెలియదు. మూడు రోజుల తర్వాత మోహన్ ఫోన్ చేశారు. "యస్, ఐ డిసైడెడ్. అయితే నేను నీతో మాట్లాడాలి" అన్నారు. "ఓకే. నేను తర్వాత చెప్తాను" అని జవాబిచ్చారు అరుణ. ఆయన సరేనన్నారు. వారం రోజుల తర్వాత "ఐ యామ్ రెడీ" అని చెప్పారు అరుణ. ఆ తర్వాత ఇంట్లోవాళ్లకు ఈ విషయం చెప్పారు. అలా 1987లో అరుణ, మోహన్ దంపతులుగా మారారు. వారికి నలుగురు కుమార్తెలు.
1980లో భారతీరాజా దర్శకత్వంలోనే 'కళ్లక్కుల్ ఈరమ్' అనే తమిళ సినిమాతో హీరోయిన్గా వెండితెరపై కాలుపెట్టిన అరుణ, పదకొండేళ్ల పాటు వివిధ రకాల పాత్రలు పోషించి, 1990 తర్వాత నటనను వదిలేసి గృహిణిగా స్థిరపడ్డారు. ప్రస్తుతం చెన్నైలోనే తన కుటుంబంతో ఆమె హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు.
Also Read